తిరుమల భక్తులతో కిటకిట
భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో నిండి పోయింది. తిరుమల గిరులు శ్రీ వేంకటేశ్వరుడి నామ జపంతో పులకించి పోయాయి. ఎక్కడ చూసినా భక్త జన సందోహమే. గోవిందా గోవిందా, శ్రీనివాసా గోవిందా, అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, శ్రీనివాసా గోవిందా, అదివో అల్లదివో శ్రీహరి వాసము, పదివేలు శేషుల పడగల మయం అంటూ భక్తులు స్మరించుకుంటూ ముందుకు సాగారు.
సెలవు రోజు కావడంతో భారీ ఎత్తున తరలి వచ్చారు భక్తులు. శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను 83 వేల 825 మంది దర్శించుకున్నారు. 25 వేల 690 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఏకంగా రూ. 4 కోట్ల 57 లక్షల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం తిరుమలలో భక్తులు డైరెక్ట్ లైన్ లో వేచి ఉన్నారని, ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 6 గంటలకు పైగానే పడుతుందని ఈవో తెలిపారు.