తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.09 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో నిండి పోయింది. ఎక్కడ చూసినా భక్తులే దర్శనం ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు.
ఈసారి స్వామి వారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఒక్క రోజే అటు భక్తుల సందడితో పాటు ఇటు హుండీ పరంగా గణనీయంగా విరాళాలు, కానుకలు సమకూరాయి. ఏకంగా రూ. 5.09 కోట్లు ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) వెల్లడించింది.
ఇక స్వామి వారికి నిత్యం వేలాది మంది తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక నిన్న ఒక్క రోజే 23 వేల 656 మంది భక్తులు శ్రీనివాసుడికి తల నీలాలు ఇచ్చారు. భారీ ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. భక్తుల సంఖ్య ఏకంగా 76 వేల 577కు చేరుకుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
భక్తుల రద్దీ పెరగడంతో 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 10 గంటలకు పైగా సమయం పడుతుందని పేర్కొన్నారు.