శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.50 కోట్లు
తిరుమల – తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. ఎక్కడ చూసినా భక్త సందోహమే కనిపిస్తోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది ఈ మహిమాన్విత స్థలం. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 344 మంది భక్తులు దర్శించుకున్నారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.50 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 20 గంటలకు పడుతుందన్నారు.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు తెలియ చేయాలని ఈవో జె. శ్యామల రావు భక్తులకు విన్నవించారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి ఈనెల నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.