తిరుమల క్షేత్రం భక్త సందోహం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువైన తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. ఎక్కడ చూసినా భక్త బాంధవులే కనిపిస్తున్నారు. గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా అంటూ కీర్తిస్తున్నారు. స్వామి వారిని స్మరిస్తున్నారు.
రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. తాజాగా శ్రీనివాసుడిని 70 వేల 338 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 741 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
నిత్యం స్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారని తెలిపారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని ఈవో వెల్లడించారు.