తిరుమల క్షేత్రం భక్త సందోహం
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది స్వామిని నిత్యం సేవిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కుంటే సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం.
రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందే తప్పా ఎక్కడా తగ్గడం లేదు. పోటెత్తిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా శ్రీవారిని 70 వేల 679 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 717 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారని టీటీడీ ఈవో వెల్లడించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
ఇక దర్శనానికి సంబంధించి ప్రస్తుతం నేరుగా భక్తుల క్యూ లైన్ ఉందని, ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం కనీసం 7 గంటలకు పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు ఏవీ ధర్మా రెడ్డి.