Wednesday, April 16, 2025
HomeDEVOTIONALఅంగ‌రంగ వైభోగం శ్రీ‌వారి వ‌సంతోత్సవం

అంగ‌రంగ వైభోగం శ్రీ‌వారి వ‌సంతోత్సవం

సాల‌క‌ట్ల వ‌సంతోత్స‌వాలకు ఘ‌నంగా ఏర్పాట్లు

తిరుమ‌ల – తిరుమ‌ల పుణ్య‌క్షేత్రంలో శ్రీ‌వారి సాల‌క‌ట్ల వ‌సంతోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామి వారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు.

వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments