పుణ్య క్షేత్రం భక్త జన సందోహం
తిరుమల – తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ తెప్పోత్సవాలు ప్రాచీన కాలం నుంచి జరగడం ఆనవాయితీగా వస్తోంది. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు’ అని కూడా అంటారు. ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.
రాత్రి 7 గంటలకు తెప్పోత్సవంలో శ్రీనివాసుడు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా భక్తులకు దర్శనం ఇస్తాడు. 10వ తేదీ సోమవారం రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాలుని అలంకారంలో తిరు మాడ వీధులలో ఊరేగుతూ పుష్కరిణిలో తెప్పోత్సవంలో విహరిస్తూ అనుగ్రహిస్తాడు. 11వ తేదీ మంగళవారం మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవితో కలిసి శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవంలో మూడు చుట్లు విహరిస్తారు.
మార్చి 12వ తేదీ మంగళవారం మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవితో కలిసి శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవంలో ఐదు చుట్లు విహరిస్తారు. 13వ తేదీ బుధవారం మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవంలో ఏడు చుట్లు విహరిస్తారు. ఈ రోజుతో శ్రీవారి తెప్పోత్సవాలు ముగుస్తాయి.
తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో శ్రీనివాసుని దర్శిస్తే అనుకూల దాంపత్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.