తిరుపతి ఎస్పీ వినూత్న కార్యక్రమం
తిరుపతి – తిరుపతి జిల్లా ఎస్పీ, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి. హర్షవర్దన్ రాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిత్యం తిరుమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇందు కోసం భక్తుల అనుమానాలు నివృత్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. కేవలం భక్తులకు విస్తృతమైన సేవలు అందించేందుకు గాను మే ఐ హెల్ప్ యు సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రధాన భక్తులు రద్దీ ప్రాంతాలైన లడ్డు కౌంటర్, టెంపుల్ ఎగ్జిట్, అఖిలాండం, రాం భగీచ బస్తాండ్, సీఆర్ఓ అన్నదాన సత్రం ,లగేజ్ కౌంటర్, వరాహ స్వామి టెంపుల్ లాంటి ప్రదేశాల్లో పోలీసు, విజిలెన్స్ సిబ్బంది MAY I HELP YOU జాకెట్ ధరించి భక్తులకు కనపడే విధంగా తిరుగుతూ ఉంటారని స్పష్టం చేశారు ఎస్పీ. వీరు భక్తులతో మాట్లాడుతూ భక్తులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడం, విజువల్ పోలీసింగ్, నేర నివారణ తో పాటు భక్తులకు తెలియని విషయాలను తెలపడం, కనపడకుండా వెళ్లిన వారి ఆచూకీ కొరకు సహకారం అందించడం, భక్తులను దర్శనం, రూమ్ పేరుతో మోసం చేసే వారి గురించి అవగాహన కల్పించడం, లాంటి కార్యక్రమాలను వీరు చేపడతారు.ఈ సేవ 24X 7 గా అందుబాటులో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.