పంచమి తీర్థానికి భారీ భద్రత
తిరుపతి జిల్లా ఎస్పీ ప్రకటన
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 6 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం పంచమి తీర్థం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు తిరుపతి ఎస్పీ ఎల్ . సుబ్బారాయుడు.
భద్రత ఏర్పాట్లకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. పంచమి పుణ్య గడియలు రోజంతా ఉంటాయని, భక్తులు ఎవరు ఆత్రుత పడి అసౌకర్యానికి గురి కాకుండా సహనం పాటించాలని సూచించారు.
క్రమ పద్ధతిలో విడతల వారీగా భక్తులకు పుణ్య స్నానం ఆచరించే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడు పుణ్య స్నానం ఆచరించే విధంగా, తొక్కిసలాటకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
పద్మావతి సరోవరం వద్ద అర్ధరాత్రి నుండి పోలీస్ పహారా కాస్తున్నట్లు తెలిపారు ఎస్పీ. హోల్డింగ్స్ ప్రాంతాల, పుష్కరిణి వద్ద పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని అన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక వ్యూహం తో పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్క్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు . బందోబస్తు విధులను దైవ కార్యం గా భావించి భక్తిశ్రద్ధలతో నిర్వర్తించాలన్నారు.
మానవసేవయే మాధవ సేవగా భావించి గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం జరిగే ఆఖరి ఘట్టంలో పకడ్బందీ వ్యూహం తో భక్తులకు మెరుగైన సేవలను అందించాలన్నారు.