సరసు ఆవేదన మోదీ స్పందన
సహకార బ్యాంకులలో సమస్యలెన్నో
కేరళ – సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ టీఎన్ సరసు చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించారు. ప్రస్తుతం ఆమె వైరల్ గా మారారు. కేరళ లోని అలత్తూరు లోక్ సభ స్థానం నుండి బీజేపీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తాజాగా బీజేపీ హైకమాండ్ ప్రకటించిన జాబితాలో తను కూడా ఒకరు.
ఈ సందర్బంగా సరసు నేరుగా ఫోన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారు. తమ కేరళ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రత్యేకించి సహకార బ్యాంకుల సమస్య ప్రధానంగా ఉందన్నారు.
పేదలు కష్టపడి దాచుకుంటున్న డబ్బులను అందినంత మేర సీపీఎం నేతలు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలు నానా తంటాలు పడుతున్నారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సరసు ప్రధానమంత్రిని కోరారు.
విషయం తెలుసుకున్న మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ విషయం గురించి తనకు కూడా ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా సరసుకు.