17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు
ప్రకటించిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: శాసనసభ్యులు, పెట్టుబడిదారుల కోరిక మేరకు డిశెంబర్ 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
వెలగపూడి సెక్రటేరియట్ 5వ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం విజయవాడలోని హోటల్ వివంతలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.
కాన్ క్లేవ్ లో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలను కూలంకషంగా వివరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారుల ఆసక్తులను తెలుసుకుని భవిష్యత్ లో ఆ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి తెలిపారు.
అడిగిన వెంటనే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి సాస్కి స్కీమ్ ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి కోసం పలువురు ఎమ్మెల్యేలు పలు ప్రతిపాదనలు తీసుకొచ్చారని వివరించారు. తమ ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అంశాలను ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆరోపించారు.
ఏ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారో తెలుసుకునేందుకు విజయవాడలో నిర్వహించే కాన్ క్లేవ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నామని మంత్రి అన్నారు. కాన్ క్లేవ్ కు జిల్లా కలెక్టర్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ల సలహాలు, సూచనలు పర్యాటకాభివృద్దికి ఉపయోగపడతాయని తాము భావిస్తున్నామన్నారు.
కాన్ క్లేవ్ లో కేంద్ర ప్రభుత్వ సహకారం, పీపీపీ విధానం, అవసరమైతే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్ (పీ4 విధానం) తదితర అంశాలను క్రోడీకరించి రూట్ మ్యాప్, సమగ్ర నివేదిక తయారు చేసుకొని భవిష్యత్ లో ఆ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.