తెలంగాణ రైతులకు ఎవుసం నేర్పింది ఆంధ్రోళ్లు
బాధ్యత కలిగిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన స్థాయిని మరిచి కామెంట్స్ చేశారు. తెలంగాణ రైతులను అవమానపరిచేలా వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్లు వ్యవసాయం చేయడం నేర్పించారంటూ పేర్కొనడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి కొలువు తీరాక ఆంధ్రోళ్ల పెత్తనం పెరిగి పోయింది. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా చంద్రబాబుకు వంత పాడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందుకు తగ్గట్టుగా టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయింది. ప్రకాశం, కృష్ణ, గుంటూరోళ్లే ఇక్కడికొచ్చి సాగు నేర్పించారని అన్నారు. నిజాంసాగర్ వల్ల ఆంధ్రా రైతులు స్థిర పడ్డారని కొనియాడారు. రైతు మహోత్సవం పేరుతో ఈ ప్రాంతపు రైతులను హేళన చేస్తూ మాట్లాడటం పట్ల మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరిస్తున్నారు తెలంగాణవాదులు.
టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా పాలకుల మెప్పు కోసమే ఇలా మాట్లాడటం దారుణమన్నారు. 1000 ఏళ్ల కిందటే సాగు చేసిన చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉందన్నారు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే బాగుండదంటూ హెచ్చరించారు.