బీసీలను వంచించింది మీరు కాదా
హైదరాబాద్ – బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏం ముఖం పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా పాలించిన మీరు బీసీలను ఏనాడూ పట్టించు కోలేదని ఆరోపించారు.
ఇప్పుడు పవర్ కోల్పోయాక బీసీలు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడవద్దని కోరారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్.
కవిత ధర్నా చేపట్టబోయే ముందు తాను సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం బీసీలపై కపట ప్రేమ చూపిస్తుందంటూ ధ్వజమెత్తారు. మోసం చేసినందు వల్లనే బీసీలు గత ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇకనైనా మారాలని లేక పోతే ప్రజలు మరోసారి కర్రకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.