విజయ సాయి రెడ్డి పై ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఆగ్రహం
హైదరాబాద్ – పార్లమెంట్ సాక్షిగా ఒక బాధ్యత కలిగిన ఎంపీగా ఉన్న వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సోయి మరిచి తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై నోరు పారేసుకున్నారు. తన అక్కసు వెళ్లగక్కారు. త్వరలోనే కూలి పోతుందంటూ కామెంట్ చేశారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎవరి బలుపు చూసుకుని విజయ సాయి రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడో చెప్పాలని నిలదీసింది.
ఈ దేశంలో మోదీ వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఇదే సమయంలో కూల్చడం అనేది ఒక పరిపాటిగా మారిందని ఆరోపించింది. ఇదిలా ఉండగా రాజ్యసభ వేదికగా ఎంపీ ఈ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంపీపై ఫిర్యాదు చేశారు పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత. బీఆర్ఎస్, వైసీపీ కలిసి సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించారు.