సమానత్వం కాంగ్రెస్ నైజం
భట్టికి జరిగింది అవమానం కాదు
హైదరాబాద్ – యాదాద్రి సాక్షిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొనసాగుతోంది. ట్విట్టర్ వేదికగా, పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా ఓ అరుదైన ఫోటోను షేర్ చేసింది. దాని కింద ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానత్వానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొంది. దళితుల పేరు చెప్పి ఓట్లు కొల్లగొట్టి పవర్ లోకి వచ్చి, తెలంగాణ పేరుతో విధ్వంసం చేసి , లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీకి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేసింది.
దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. దళితులకు పెద్దపీట వేసిందని పేర్కొంది. దళితుడైన భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని తెలిపింది. చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని సూచించింది పార్టీ.