బీజేపీకి మద్దతు ఇచ్చింది మీరు కాదా
హైదరాబాద్ – రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్ నేతలు ఎవరికి మద్దతు ఇచ్చారో ప్రజలకు తెలుసని పేర్కొంది. పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు సపోర్ట్ చేసింది మీరు కాదా అని ప్రశ్నించింది. జనం అంత త్వరగా మరిచి పోతారని అనుకుంటే పొరపాటేనని పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు చేయడం కల్వకుంట్ల కుటుంబానికి ఓ అలవాటుగా మారిందని ఆరోపించింది. ఇక నుంచి నోరు జారితే ఊరుకోమని హెచ్చరించింది.
అందుకే జనం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారంటూ ఎద్దేవా చేసింది. వ్యవస్థలను నాశనం చేసి, లక్షల కోట్ల అప్పులు రాష్ట్రం నెత్తిన పెట్టింది మీరు కాదా అని మండిపడింది. 2014 నుంచి 2023 వరకు బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కాక ఇప్పుడు తమకు ఏమీ తెలియదని బుకాయించడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ.
ఈ దేశంలో మోనార్క్ లాగా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు తమ నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి పోరాడుతానని చెప్పిన మీ తండ్రి కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ నిలదీసింది.