కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్
నిప్పులు చెరిగిన కాంగ్రెస్
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. శనివారం ఆ పార్టీ ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కొలువు తీరడాన్ని జీర్ణించు కోలేక పోతున్నాయంటూ బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
ఇందులో భాగంగా నిన్నటి దాకా ఆ రెండు పార్టీలు తోడు నీడగా కొనసాగాయని, లోపాయికారి ఒప్పందంలో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, పీఎం మోదీ కవితను అరెస్ట్ చేయించారంటూ ఆరోపించింది. పక్కా ప్లాన్ తోనే ఇది చేశారంటూ పేర్కొంది.
ఎవరైనా స్వంత కూతురు అరెస్ట్ అయితే స్పందిస్తారని కానీ ఇప్పటి వరకు దొర కేసీఆర్ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. ఆయన మౌనంగా ఉండడం దేనికి నిదర్శనమని ప్రశ్నించింది. ప్రస్తుతం అన్ని సర్వేలు గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున సీట్లను కైవసం చేసుకుంటుందని చెబుతున్నాయని, ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయని ఆరోపించింది.