DEVOTIONAL

తిరుమ‌ల‌లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్

Share it with your family & friends

జెండా ఊపి ప్రారంభించిన అడిష‌న‌ల్ ఈవో

తిరుమ‌ల – తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ ధ్యేయంగా చేసుకుని, క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆధునికీకరించబడిన 12 ద్విచక్ర వాహనాలను సోమ‌వారం తిరుమల సీఆర్ఓ కార్యాలయం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి , జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో మాట్లాడారు. తిరుమలలో భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకూడదనే ముఖ్య ఉద్దేశంతో తక్షణ చర్యలలో భాగంగా ఇవాళ‌ అధునాతన సాంకేతిక పరికరాలు అమర్చిన 12 ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించామ‌న్నారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలో భక్తుల వాహనాలను పార్క్ చేయిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడదని, ఈ ప్రణాళికను జిల్లా ఎస్పి గ ఆధ్వర్యంలో తిరుమల ట్రాఫిక్ పోలీసు వారు అమలు చేస్తారన్నారు.

తిరుమల ట్రాఫిక్ సమస్యపై అధ్యయనం చేసేందుకు పోలీసు, టిటిడి విజిలెన్స్ అధికారులు, నిపుణులతో కూడిన కమిటీని ఇదివరకే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారు ప్రతిపాదించిన స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా ఈ వాహనాలను ప్రారంభించామని తెలిపారు. త్వరలో దీర్ఘకాలిక ప్రణాళికను నివేదిస్తారని, నివేదిక మేరకు పోలీసు, టీటీడీ విజిలెన్స్ , ఇతర శాఖల భాగస్వామ్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవస్థను తిరుమలలో ఏర్పాటు చేస్తామన్నారు ఏఈవో.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుమల నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా ఉంద‌న్నారు. ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ , క్రమబద్ధీకరణ చేసేందుకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారన్నారు.

ట్రాఫిక్ పోలీసులను ప్రోత్సహిస్తూ ప్రస్తుతం విధుల్లో ఉన్న 12 ద్విచక్ర వాహనాలకు GPS సిస్టం, ఫ్లాష్ లైట్, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం, సైరన్ వంటి ఆధునిక సాంకేతికత పరికరాలను అమర్చి ఆధునికీకరించడం జరిగిందన్నారు.

తిరుమలను 5 జోన్లుగా విభజించి, ప్రతి జోన్లో ఒక ట్రాఫిక్ మొబైల్ నిరంతరం ఉండే విధంగా నియమించి వారి జోన్ లో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ సూచనల మేరకు పని చేస్తారన్నారు.

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనాల ఫోటోలు తీసి, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా జరిమానాలు విధించేటట్లు పని చేస్తార‌ని పేర్కొన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహిస్తారన్నారు.

తిరుమలలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తప్పించుకొని వెళ్లినా కూడా వారికి అలిపిరి చెక్ పాయింట్ వద్ద జరిమానా విధించే విధంగా రాబోయే రోజులలో పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శనం చేసుకుని వెళ్లేలా పోలీసు, టిటిడి విజిలెన్స్ విభాగాలు సమిష్టిగా పనిచేస్తాయని ఎస్పీ తెలిపారు.