ప్రజా యుద్ధ నౌకా అల్విదా
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా
హైదరాబాద్ – ప్రజా యుద్దనౌక గద్దర్ ఈ లోకాన్ని వీడి ఏడాది పూర్తయిందంటేనే నమ్మలేకుండా ఉంది. కాలం ఎంత విచిత్రమైంది . ఎంత బాధాకరమైనదో తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తాయి. గుమ్మడి విఠల్ రావు నుంచి గద్దర్ దాకా సాగించిన ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచపు కళా రంగస్థలం మీద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప యోధుడు. పాటల పాలపుంత..పలవరింత తను.
జనం కోసం బతికి..జనం గొంతుకగా మారి పోయిన మహోన్నత కవి, గాయకుడు, రచయిత గద్దర్. ఆయన తిరుగని ప్రాంతం లేదు. శరీరంలో తూటాలు పెట్టుకుని జనం కోసం గానం చేసిన ఏకైక పాటగాడు. వేలాది పాటలు కట్టాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. అన్నింటిని భరించాడు. అవకాశాలు వచ్చినా, కాసులు ముందు వాలినా వాటన్నింటిని వద్దని ప్రజల కోసమే ఉంటానని ప్రకటించాడు గద్దర్.
కోట్లాది మందిని తన ఆట పాటలతో ఉర్రూతలూగించి, చివరి దాకా పాటే నా ప్రయాణం అంటూ సాగి పోయాడు. ఆయన భౌతికంగా లేక పోవచ్చు..కానీ అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ ఆక్రోశించాడు. పేదలు, సామాన్యులు, అన్నార్థులు..అభాగ్యులు..బడుగులు..బహుజనులు..ఇలా ప్రతి ఒక్కరు తమలో గద్దర్ ను చూసుకున్నారు. ఆయనతో పాటై ప్రయాణం చేశారు.
గద్దర్ కేవలం మూడు అక్షరాల పదం కాదు..అది కోట్లాది ప్రజల ఆర్తనాదం. ఆర్తి గీతం. ఆయన భౌతికంగా లేక పోవచ్చును గాక..కానీ ప్రపంచం ఉన్నంత దాకా..సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత కాలం పాటై మనల్ని పలకరిస్తూనే ఉంటాడు..గుర్తు చేస్తూనే ఉంటాడు..అప్రమత్తం చేస్తూనే ఉంటాడు..గద్దర్.