సత్యాన్ని నిర్మూలించ లేరు – జగన్ రెడ్డి
అబద్దాలు తప్పా పాలనలో ఏముంది
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై, తన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై పదే పదే దుష్ప్రచారం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. టీడీపీ కావాలని ఫేక్ ప్రచారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేవలం ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వారు చెప్పిందే వాస్తవం అనే రీతిన ప్రసారం చేయడం, సోషల్ మీడియా వేదికగా పదే పదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఆరు నూరైనా సరే తాము ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా యుద్దం చేస్తామని ప్రకటించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారం పట్ల ఏదో ఒక రోజు అసంతృప్తి వెళ్లగక్కడం ఖాయమని జోష్యం చెప్పారు మాజీ సీఎం.
ఈ యుద్ధంలో అక్రమ నిర్బంధాలు, అనవసర వేధింపులు, తప్పుడు కేసులు రోజు క్రమాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రతి యుద్ధంలో నేను మీతో ఉన్నానని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు వివిధ విభాగాల బాధ్యులకు భరోసా ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి,
చివరగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యం మాత్రమే గెలుస్తుందని స్పష్టం చేశారు.