563కి చేరిన ఉద్యోగాల సంఖ్య
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తాజాగా గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను అదనంగా చేర్చుతున్నట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గతంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువరించింది. అయితే తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో వాటి భర్తీ అటకెక్కింది. ఇదే సమయంలో ప్రభుత్వం మారింది. సీఎం రేవంత్ రెడ్డి కొలువు తీరాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశారు.
గతంలో ఉన్న చైర్మన్, సభ్యులను వెళ్లి పోయేలా చేశారు. వారు గత్యంతరం లేక తమ పదవుల నుంచి తప్పుకున్నారు. గవర్నర్ కూడా ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతలను అప్పగించారు. ఆయన నియామకంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 60 పోస్టులను అదనంగా పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో గతంలో 503 పోస్టులతో పాటు తాజా వాటితో కలుపుకుంటే మొత్తం 563 పోస్టులు భర్తీ చేయనుంది కమిషన్.