మహాలక్ష్మీతో ఆర్టీసీ కళ కళ
పాత సర్వీసుల పునరుద్దరణ
హైదరాబాద్ – గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నేల చూపులు చూస్తూ నిరాదరణకు గురైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఇప్పుడు కళ కళ లాడుతోంది. నూతన టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త బస్సులను నడుపుతూ వస్తోంది ఆర్టీసీ. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న వీసీ సజ్జనార్ పదవీ బాధ్యతలు చేపట్టాక సంస్థను మెల మెల్లగా గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.
ఈ తరుణంలో రాష్ట్రంలో అనూహ్యంగా ప్రభుత్వం మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. ఎన్నికల ప్రచారం సందర్బంగా కాంగ్రెస్ సంచలన హామీ ఇచ్చింది.
రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, యువతులు అందరికీ ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వెళ్ల వచ్చని ప్రకటించింది. ఈ మేరకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దీంతో ఇప్పుడు ఆర్టీసీ బస్టాండులు ప్రయాణీకులతో కళ కళ లాడుతున్నాయి.
రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సంస్థ పాత సర్వీసులను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు ఎండీ సజ్జనార్.