హెచ్చరించిన ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్టకష్టాలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారంటూ ఆర్టీసీ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు ఆ సంస్థ ఎండీ సజ్జనార్. ఇటీవల సిబ్బందిపై తరుచూ దాడులు జరుగుతున్నాయని దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొలువు తీరిన కొత్త సర్కార్ ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించింది.
దీంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. కానీ రద్దీకి తగినట్లుగా బస్సులను ఏర్పాటు చేయక పోవడం ఒకింత ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సులను తగ్గిస్తూ రావడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా సోమవారం కీలక ప్రకటన చేశారు ఎండీ సజ్జనార్. ఇక నుంచి ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులపై దాడులు చేసినా లేదా కండక్టర్, డ్రైవర్లపై దూషించినా, వ్యక్తిగతంగా దాడికి పాల్పడినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. హయత్ నగర్ డిపో -1 కు చెందిన ఇద్దరు కండక్టర్లపై దాడికి పాల్పడిన సయ్యద్ సమీనాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.