సీఎంకు ఆర్టీసీ ఎండీ థ్యాంక్స్
ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్
హైదరాబాద్ – గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని రీతిలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2017 కు సంబంధించి ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ 21 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రకటించారు.
దీని వల్ల ఆర్టీసీలో ప్రస్తుతం పని చేస్తున్న 51 వేల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి మేలు జరుగుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ సందర్బాన్ని పురస్కరించుకుని ఎండీ ఆధ్వర్యంలో యూనియన్ నేతలు, ఉద్యోగులు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.
సీఎంకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు కూడా ఉన్నారు. సంస్థ పురోగతికి దోహద పడుతున్న సర్కార్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు వీసీ సజ్జనార్. ఈడీలు మునిశేఖర్ , కృష్ణకాంత్ , వెంకటేశ్వర్లు , పురుషోత్తం, ఆర్థిక సలహాదారు విజయ పుష్ప పాల్గొన్నారు.