హెచ్చరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆన్ లైన్ మోసాలపై తీవ్రంగా స్పందించారు. కొందరు కావాలని ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ తమను తాము గొప్పగా ఊహించు కుంటున్నారని అన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని స్పష్టం చేశారు. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చరించిందన్నారు.
గురువారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందంచారు వీసీ సజ్జనార్. ఆయన గత కొంత కాలంగా ఆన్ లైన్ మోసాలపై హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రజలను, యువతను మోసానికి గురి కాకుండా ఎలా ఉండాలనే విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు.
అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారని మండిపడ్డారు. మీరంతా శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. తమకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. మేం ఏం చేసినా నడుస్తుందని అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు.
సమాజ శ్రేమస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఆపాలని కోరారు.