వీసీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – ప్రస్తుతం సోషల్ మీడియాను వాడే వారు ఎక్కువై పోయారని, వాటి పట్ల జాగ్రత్తతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ . చదువు కోవాల్సిన వయసులో చెడు విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చిన్న తనంలోనే సామాజిక మాధ్యమాలకు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నెం పున్నెం ఎరుగని యువతీ యువకులు వక్రమార్గాలను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు ఎండీ వీసీ సజ్జనార్.
ప్రత్యేకించి టీనేజర్లు లైంగిక వేధింపులకు గురవుతుండటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పరోక్ష కారణం తల్లిదండ్రులేనని నిందించారు. తమ బిజీ లైఫ్ ని కాస్త పక్కనపెట్టి.. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి ఘటనలకు అసలు ఆస్కారమే ఉండదన్నారు.
పిల్లల కదలికలను తల్లిదండ్రులు కచ్చితంగా ఓ కంట కనిపెట్టాలని సూచించారు ఎండీ. మీ పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారా!? వ్యక్తిగత సమాచారం ఎవరికైనా షేర్ చేస్తున్నారా? ఎవరైనా వారిని వేధింపులకు గురిచేస్తున్నారా అని గమనించాల్సిన బాధ్యత మీదేనంటూ పేర్కొన్నారు సజ్జనార్.