ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు స్టార్ట్
ప్రారంభించిన భట్టి, పోన్నం ప్రభాకర్
హైదరాబాద్ – మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు లబ్ది పొందుతున్నారని, ప్రతి ఇల్లు, బస్సు కళ కళ లాడుతోందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంగళవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 25 ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులను ప్రారంభించారు డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్బంగా జెండా ఊపి భట్టి ప్రారంభిస్తే, బస్సును నడిపారు కోమటిరెడ్డి . ఈ బస్సులో ఎండీ సజ్జనార్ తో పాటు పలువురు ఉన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఏరియర్ బాండ్స్ చెక్కులను ఆర్టీసీ ఉద్యోగులకు డిప్యూటీ సీఎంతో కలిసి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. సీఎం సూచనల మేరకు 2017కు సంబంధించి 21 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించామని , త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు మంత్రి.
ఆర్టీసీలో ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం ప్రకటించిన తర్వాత లక్షలాది మంది బస్సులలో ప్రయాణం చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామన్నారు.