శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం తనిఖీ
పరిశీలించిన అదనపు ఈవో చౌదరి
తిరుమల – టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్ వెంకయ్య చౌదరి దూకుడు పెంచారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు అదనపు ఈవో. ఆయన వెంట జేఈవో వీర బ్రహ్మం కూడా ఉన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్య వంతంగా టికెట్లు జారీ చేసేందుకు, గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేషు విశ్రాంతి గృహం ప్రక్కన వున్న టీటీడీ కల్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయాన్ని పరిశీలించారు ఏఈవో వెంకయ్య చౌదరి. అనంతరం ఇటీవల ఆధునీకరించిన అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరాన్ని కూడా పరిశీలించారు.
ఈ సందర్బంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి పలు సూచనలు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలతో పాటు దర్శన భాగ్యం కల్పించేందుకు ఫోకస్ పెట్టామన్నారు.
అదనపు ఈవో వెంట ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో సెల్వం, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.