తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
తిరుమల – తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మలయప్ప స్వామి వారు 7 ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందిస్తున్నారు. వాహన సేవలను తిలకించేందుకు మాడ వీధుల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఆలయ మాడ వీధులను రంగవళ్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎండలో నడిచేందుకు ఇబ్బంది పడకుండా వైట్ పెయింట్ వేశారు.
భక్తులకు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు సేవలందిస్తున్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహన సేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.
రథసప్తమి సందర్భంగా భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల పంపిణీని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి వీరబ్రహ్మం పరిశీలించారు.