గరుడ సేవ ఏర్పాట్లపై అదనపు ఈవో సమీక్ష
అక్టోబర్ 4 నుండి 12 వరకు బ్రహ్మోత్సవాలు
తిరుమల – శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉన్నందున, అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడ సేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో కీలక సమావేశం చేపట్టారు. ఇందులో భాగంగా గ్యాలరీల లోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచడం, భక్తుల రవాణా, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అదనపు ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మెరుగైన సమాచారం కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్థం వయో వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో పాటు, అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందని చెప్పారు.
అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాక పోకలను నిషేధించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో టీటీడీ సిఇ సత్యనారాయణ, తిరుమల లోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.