వైకుంఠ ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు
సమీక్షించిన ఏఈవో వెంకయ్య చౌదరి
తిరుమల – 2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలన్నారు.
పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు ప్రవేశం కల్పిస్తామన్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఏఈవో.
చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేశామన్నారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవన్నారు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఏఈవో.
ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశం. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు .
భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగు నీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు . పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
తిరుమలలో శోభాయమానంగా విద్యుద్దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించడం జరుగుతుందన్నారు.