సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం
తిరుమల – ఏపీ సర్కార్ ఎట్టకేలకు దిగి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన సిఫార్సు లేఖలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి 24 నుంచి ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. .
ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ వారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది. (సోమ, మంగళవారం దర్శనాలకు గాను) అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని (ఏ రోజు కా రోజు దర్శనం) తెలియ జేయడమైనది. (ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే 06 మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది).
ఇప్పటివరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు (ఆదివారం దర్శనం కొరకు) స్వీకరించబడతాయి. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణయించింది.