రేపు తిరుమలలో కార్తీక వన భోజనం
భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో వేదిక మార్పు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో కార్తీక వన భోజన కార్యక్రమాన్ని నవంబర్ 17న ఆదివారం శ్రీవారి ఆలయం సమీపంలోని వైభవోత్సవ మండపంలో టీటీడీ నిర్వహించనుంది.
సాధారణంగా పార్వేట మండపంలో ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తోంది. వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. పవిత్రమైన కార్తీక మాసంలో వన భోజనం చేపడతామని తెలిపింది.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉభయ నాంచారులతో కలిసి వైభవోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు.
ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామి వారు ఆలయానికి వేంచేపు చేస్తారు.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.