తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
ప్రకటించిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామి వారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఇక విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపారు ఈవో. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరారు.