DEVOTIONAL

భ‌క్తులు కేటాయించిన స‌మ‌యానికే రావాలి

Share it with your family & friends

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో శ్యామ‌ల రావు

తిరుమ‌ల -టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సుదూర ప్రాంతం నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా త‌మ‌తో స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఎస్ఎస్డీ, ఎస్ఈడీ టికెట్లు పొందిన భ‌క్తులు వారికి కేటాయించిన స‌మ‌యానికే రావాల‌ని కోరారు.

తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డి టోకెన్‌లు, ఎస్‌ఇడి టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో, చాలా గంటలు వేచి ఉండవలసి వస్తోందన్నారు.

టిటిడి గత కొన్ని రోజులగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోందని స్ప‌ష్టం చేశారు ఈవో జె. శ్యామ‌ల రావు.

కానీ, ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరు బయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ద్వారా, భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. నేటి నుండి తిరుపతి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కూడా భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా, తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చని ఈవో తెలిపారు.