టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుమల – 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని వివరించారు. పోటు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయంతో పాటు జీతం పెంపుపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొడంగల్, కరీంనగర్, ఉపమాక, అనకాపల్లె, కర్నూలు, ధర్మవరం, తలకోన, తిరుపతి గంగమ్మ ఆలయాల పునః నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు. శ్రీవారి అన్నప్రసాదాలకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన దాతల డొనేషన్ పాసు బుక్కులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో జె.శ్యామలరావుతో కలసి సోమవారం బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమలలోని వీఐపీ, నాన్ వీఐపీ అతిథి గృహాలలో కొన్నింటిని తొలగించి పునః నిర్మాణం చేపట్టేందుకు, మరికొన్నింటిని ఆధునీకరించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలిపిరి వద్ద సైన్స్ సిటీ, మ్యూజియం ఏర్పాటుకు గతంలో కేటాయించిన 20 ఎకరాల భూమి రద్దు చేశామన్నారు. లైసెన్స్ లేని హాకర్స్‌ను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం 5.30 గంటలకు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు . టిటిడి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సుపథం ద్వారా ఆరు టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు టీటీడీ చైర్మన్. టిటిడి కళాశాలలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నూతన ఆగమ సలహా మండలి మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు రూ.కోటి మంజూరు చేశామన్నారు. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించింది పాలక మండలి.