టీటీడీ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ
ఎవరికి దక్కేనో ఉన్నతమైన పదవి
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటే సకల దోషాలు పోతాయని, కోరుకున్న కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం..విశ్వాసం కూడా. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగి ఉన్నారు స్వామి వారు.
ఇది పక్కన పెడితే కోట్లాది ఆస్తులు, లెక్కకు మించిన ఆదాయం, చెప్పలేనంత ఆభరణాలు , స్థలాలు ఉన్నాయి. ఇప్పటి దాకా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాలకు నెలవుగా మారిందన్న ఆరోపణలు వచ్చాయి. గత జగన్ రెడ్డి సర్కార్ హయాంలో కొలువు తీరిన ఈవో ధర్మా రెడ్డి అధర్మా రెడ్డిగా పని చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో సర్కార్ మారింది..తిరుమలకు కొత్త ఈవోగా జె. శ్యామల రావు వచ్చారు. ప్రస్తుతం పనితీరులో కొంత ప్రగతి కనిపిస్తోంది. భక్తులకు వసతి సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ తరుణంలో బుధవారం కీలక ప్రకటన చేసింది టీటీడీ. పాలక మండలి పూర్తిగా రద్దయింది. ఇందులో 24 మంది సభ్యులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులను నియమించాల్సి ఉంది.
టీటీడీ చైర్మన్ రేసులో అశోక్ గజపతి రాజు, బీఆర్ నాయుడు, దర్శకుడు కె. రాఘవేంద్ర రావు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వివాద రహితుడిగా పేరున్న గజపతికే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.