టీటీడీలో అన్యమత ఉద్యోగులపై వేటు
సంచలన ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం తిరుమలలోని నూతన పాలక మండలి సమావేశమైంది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానికి సంబంధించి వివరాలు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సామాన్యభక్తులు త్వరగా ( గంటల వ్యవధిలో) శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుందన్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను విఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేస్తామన్నారు.
యేళ్ళ తరబడి చెత్తతో పేరుకు పోయిన డంపింగ్ యార్డ్ లో చెత్తను మరో 3 నెలల్లో తొలగిస్తామన్నారు. తిరుపతిలో ప్రస్తుతం శ్రీనివాససేతు గా ఉన్న ఫ్లై ఓవర్ కు మునుపటి పేరు గరుడ వారధి గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు.
తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న అపోహాలు దృష్ట్యా …ట్రస్ట్ పేరుని రద్దు చేసి టీటీడీ మెయిన్ ఆకౌంట్ ద్వారా లావాదేవీలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తిరుపతి స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. టూరిజం దర్శనం టిక్కెట్లు కోటా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ శారదా పీఠం నిర్మాణం పూర్తిగా నిభందనలకు వ్యతిరేకంగా జరిగిందని గుర్తించామన్నారు. లీజు రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అలిపిరి జూపార్క్ రోడ్డులో గతంలో దేవలోక్ కోసం కేటాయించిన భూమిని….ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిందని , భక్తుల మనోభావాలు దెబ్బ తీసింది కావున భూమి లీజు రద్దు చేస్తున్నామని తెలిపారు.