ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కోసం ధార్మిక సదస్సు
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తిరుమల – శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కోసమే తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ధార్మిక సదస్సు ఏర్పాట్లను ఇవాళ ఛైర్మన్ పరిశీలించారు
ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరింతగా హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్న వయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు చేపడుతోందన్నారు.
ఇందులో భాగంగా ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఇప్పటివరకు 57 మంది పీఠాధిపతులు సదస్సుకు విచ్చేసేందుకు సమ్మతి తెలియజేసినట్టు చెప్పారు.
శ్రీవారి ఆలయం నుండి ఏ సందేశం వెళ్లినా భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని ఛైర్మన్ తెలిపారు. 16 సంవత్సరాల క్రితం తాను ఛైర్మన్‌గా ఉన్నపుడు ధార్మిక సదస్సులు నిర్వహించామని చెప్పారు. ఇందులో పీఠాధితులు చేసిన సూచనల మేరకే దళిత గోవిందం, కల్యాణ మస్తు, గిరిజన గోవిందం, కైశిక ద్వాదశి లాంటి ధార్మిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.