DEVOTIONAL

జ‌న బాహుళ్యంలోకి సారంగ‌పాణి కీర్త‌న‌లు

Share it with your family & friends

టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుప‌తి – శ్రీ వేణు గోపాలస్వామి వారిపై ప్ర‌ముఖ వాగ్గేయ‌కారుడు సారంగ‌పాణి అద్భుత‌మైన కీర్త‌న‌లు ర‌చించి, స్వ‌ర ప‌రిచార‌ని, మ‌రుగున ప‌డిన వాటిని జ‌న బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామ‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అన్నారు.

తిరుప‌తి శ్వేత భ‌వ‌నంలో సాయంత్రం ప్ర‌ముఖ సినీ సంగీత క‌ళాకారిణి, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత డా. పి.సుశీలతో క‌లిసి ఛైర్మ‌న్ నూత‌న సారంగ‌పాణి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీబీసీ ఛైర్మ‌న్ సాయికృష్ణ యాచేంద్ర స్వ‌ర ప‌రిచిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ ద్విప‌ద శ్రీ‌భాగ‌వ‌తం సిడిని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మాట్లాడారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం ప్రాంతంలో నివసించిన 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి, కర్ణాటక సంగీత స్వరకర్త సారంగపాణి పేరిట నూత‌న ప్రాజెక్టును ప్రారంభించ‌డం శుభ ప‌రిణామం అన్నారు.

శ్రీ వేణు గోపాల స్వామి వారిని కీర్తిస్తూ సారంగపాణి తెలుగు, సంస్కృత భాషల్లో సుమారు 5 వేల కీర్తనలు రచించారని, ప్ర‌స్తుతం 500 కీర్త‌న‌లు మాత్ర‌మే ల‌భ్య‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. అందుబాటులో ఉన్న కీర్త‌న‌ల‌ను స్వ‌ర ప‌ర‌చ‌డంతో పాటు నూత‌న కీర్త‌న‌ల‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంద‌న్నారు.

గాలిగోపురం, మోకాలి మెట్టు, ఏడో మైలు ఆంజ‌నేయ స్వామి వారి విగ్ర‌హం వ‌ద్ద నిత్య సంకీర్త‌నార్చ‌న చేసేందుకు గ‌త బోర్డు స‌మావేశంలో నిర్ణ‌యించామ‌న్నారు. తిరుమ‌ల‌లో వెంగ‌మాంబ బృందావనం ఆధునీక‌ర‌ణ ప‌నులు పూర్తి కాగానే అక్క‌డ కూడా నిత్య సంకీర్త‌నార్చ‌న నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆల‌యాల సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేలా శ్వేతను అభివృద్ధి చేస్తామ‌న్నారు.

ప్ర‌ముఖ సినీ సంగీత క‌ళాకారిణి, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత డా. పి.సుశీల మాట్లాడుతూ సారంగ‌పాణి కీర్త‌న‌లు అమోఘ‌మైన‌వ‌ని, వారి పేరిట ఏర్పాటుచేసిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలో పాల్గొన‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పారు. అనంత‌రం ప‌లు మ‌ధుర‌గీతాల‌ను వారి విన‌సొంపైన స్వ‌రంతో ఆల‌పించి స‌భ‌ను ఆనంద డోలిక‌ల్లో ముంచెత్తారు.