రేపటి నుండి సుప్రభాతం సేవ రద్దు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి సుప్రభాతం సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు . ఇవాళ్టి నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.
తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ గుడుల్లో ధనుర్మాస కైంకర్యాలు, సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు జరుగుతుందని వెల్లడించారు.
ఇవాళ ఉ 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అవుతాయని తెలిపారు. రేపటి నుండి తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలు కొలుపు జరుగుతుందన్నారు బీఆర్ నాయుడు. తులసీ దళాలకు బదులుగా.. బిల్వ పత్రాలతో శ్రీవారికి సహస్ర నామార్చన ఉంటుందని తెలిపారు.
శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామి వారికి అలంకరణ చేస్తారని, విశేష నైవేద్యాలుగా బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలు నివేదన ఇస్తారన్నారు బీఆర్ నాయుడు.
భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ జరుగుతుందని వెల్లడించారు.