శ్రీవారి చిత్ర పటం..ప్రసాదం అందజేత
హైదరాబాద్ – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ )ను కలుసుకున్నారు.
బుధవారం హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ కు శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్ర పటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం టీటీడీ నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 ఛానల్ వ్యవస్థాపక చైర్మన్ బీఆర్ నాయుడును ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు కేటీఆర్.
సామాన్య భక్తులకు ఆ కలియుగ వాసుడి దర్శన భాగ్యం కల్పించేలా చూడాలని సూచించారు. సమర్థవంతమైన మీ నిబద్దత తిరుమలకు మరింత శోభను తీసుకు వచ్చేలా చేస్తుందని తాను నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మల ఆశీస్సులతో తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు.