ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో కార్యక్రమం
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆవిష్కరించారు. ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్త లోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రకారం ఈ ఏడాది కూడా నూతన సంచాంగాన్ని భక్తులకు అందిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది.
టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకట పూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖానస పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టా చార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణ మేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు.
రూ.75/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టిటిడి సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుందని తెలిపారు జేఈవో జె. వీరబ్రహ్మం.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకటపూర్ణ ప్రసాద్, ప్రెస్, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి రామరాజు, డిప్యూటీ ఈవోలు నటేష్ బాబు, ప్రశాంతి, గోవింద రాజన్, సెల్వం, సీపీఆర్వో డా.టి.రవి, ఎస్ ఈలు వేంకటేశ్వర్లు, మనోహర్, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా.సునీల్ కుమార్, వీజీవో సదాలక్ష్మి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి. ఆదినారాయణ రెడ్డి, ఏవీఎస్వో వై.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.