Friday, April 4, 2025
HomeDEVOTIONALశ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం

శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం

టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు

అమ‌రావ‌తి – అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వేంటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. సీఎం చంద్ర‌బాబు ఆకాంక్ష మేరకు శ్రీనివాస కళ్యాణం అనంతరం స్వామి వారి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మొదటి విడతగా రూ. 30 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జ‌ర‌గ‌డం ఆనందంగా ఉందన్నారు.

ఇందులో భాగంగా గురువారం అమరావతి రైతులతో, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. శ్రీవారి కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు, మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు , రాజధాని రైతులు , వివిధ గ్రామాలు, ప్రాంతాల నుండి ప్రజలు పాల్గొంటారని తెలిపారు.

టిటిడి ఈవో జె.శ్యామలరావు మాట్లాడుతూ, శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల నుండి అర్చక స్వాములు, వేద పండితులు, మంగళ ధ్వని, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు విచ్చేస్తున్నారని తెలిపారు.కళ్యాణ వేదిక నిర్మాణంతో పాటు 27 వేల మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా సదుపాయాలు కల్పిస్తున్నామ‌ని తెలిపారు.

గుంటూరు, విజయవాడ తదితర ముఖ్యమైన ప్రాంతాలలో ఫ్లెక్సీ బోర్డులు, హోర్డింగులు ఏర్పాటు చేశామ‌ని చెప్పారు ఈవో. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు, కళ్యాణ వేదిక పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశామ‌న్నారు. వేదిక చుట్టూ భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు ఈవో. నిరంతరాయంగా జనరేటర్స్ ద్వారా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామ‌ని తెలిపారు. టిటిడి నిఘా, భద్రతా విభాగం నుండి 160 మంది, గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 600 మందితో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్న‌ట్లు చెప్పారు.

పోలీస్ వారి సహకారంతో ఐదు డ్రోన్లు, 70 సీసీ కెమెరాలు భద్రత , పర్యవేక్షణ కొరకు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశామ‌న్నారు జె. శ్యామ‌ల రావు.
ఆలయం వెనుక వివిఐపీల కొరకు 400 వాహనాలకు , ఆలయం కాంపౌండ్ వాల్ వెనుక 1000 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. అదేవిధంగా సీడ్ యాక్సిస్ రోడ్డు దక్షిణం వైపు 1500 వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించామ‌న్నారు. శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనే భక్తులందరికీ శ్రీవారి సేవకుల సహకారంతో మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామ‌ని చెప్పారు.

HDPP ప్రచార రథాల ద్వారా శ్రీవారి ఆలయం సమీపంలోని 27 గ్రామాలలో ఇంటింటికి కరపత్రాలు, వాల్ పోస్టర్స్ పంపడం జరిగిందన్నారు. ⁠శ్రీనివాస కళ్యాణాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. మీడియా వారికి లైవ్ ఫ్రీక్వెన్సీ లోగో లేకుండా ఇస్తామ‌న్నారు. టిటిడి పిఆర్ విభాగం , జిల్లా ఐ అండ్ పిఆర్ విభాగం ద్వారా పత్రికా ప్రకటనలు, ఫోటోలు మీడియాకు పంపిస్తామ‌న్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు APSRTC సహకారంతో 310 బస్సులతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామ‌ని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments