శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు టీటీడీ సిద్దం
చర్యలకు ఆదేశించిన చైర్మన్ నాయుడు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్దమైంది. ఆయన ఇటీవలే తిరుమల వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భక్తులను పట్టించు కోవడం లేదని ఆరోపించారు. వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఇక్కడి నేతల సిఫారసు లేఖలను పక్కన పెడుతున్నారని వాపోయారు. దీనిపై గౌడ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీటీడీ పాలకమండలి సభ్యులు.
ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. కించ పరిచేలా కామెంట్స్ చేసిన శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. చైర్మన్ ఆదేశించడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
ఈనెల 24న జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలా లేదా అనే విషయంపై చర్చించనున్నారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైతం తిరుమల సాక్షిగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ఆలయాల్లో ఆంధ్రాకు చెందిన వారి సిఫారసు లేఖలకు స్పందిస్తున్నారని, కానీ టీటీడీలో అలా జరగడం లేదని ఆరోపించారు.