స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ నాయుడు
తిరుపతి – టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వసతి సేవలు అందజేస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రోగులతో ముచ్చటించారు. కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఇప్పటికే మాజీ టీటీడీ ఈవో ఐవీ సుబ్బా రావుతో ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మూడు నెలల పాటు పూర్తిగా అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందని తెలిపారు. చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు బీఆర్ నాయుడు.
అంతకు ముందు టిటిడికి అనుబంధంగా ఉన్న స్విమ్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మితమవుతున్న క్యాన్సర్ భవానాన్ని టిటిడి ఛైర్మెన్ పరిశీలించారు. 391 పడకలు గల నూతన క్యాన్సర్ భవనాన్ని, అందులోని 5 ఆపరేషన్ థియేటర్లను, పరికరాలను పరిశీలించారు. స్విమ్స్ కార్డియో థొరాసిక్ విభాగంలో శస్త్ర విభాగంలో చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన అన్నాభాయ్ (24 సంవత్సరాలు), ప్రకాశం జిల్లా రామాయపాలెం గ్రామానికి చెందిన బి. బన్సికా (2 సంవత్సరాలు) ఆరోగ్యం, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కలిగిరి, కడప జిల్లా ఓబుళవారిపల్లి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ ఫర్ట్ కమిటీ ఛైర్మన్ డా.ఐ.వి.సుబ్బారావు, సభ్యులు డా. జెఎస్ఎన్ మూర్తి, తేజోమూర్తుల రామోజీ, డా. చెన్నంశెట్టి విజయ్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్వీ కుమార్, టిటిడి బోర్డు మెంబర్ ఎన్. సదాశివరావు, జేఈవో వి. వీరబ్రహ్మోం, సీఈ సత్యనారాయణ హాజరుకాగా వర్చువల్ గా హెల్త్ స్పెషల్ సిఎస్ ఎం.టి. కృష్ణబాబు, టిటిడి బోర్డు మెంబర్ సుచిత్రా ఎల్లా, ఎండోమెంట్ సెక్రటరీ వినయ్ చంద్ తదితరులు హాజరయ్యారు.