క్షురకుల ప్రవర్తనపై బీఆర్ నాయుడు ఆరా
తిరుమల – టీటీడీ చైర్మన్ గా కొలువు తీరాక బీఆర్ నాయుడు తిరుమల క్షేత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా సామాన్య భక్తులకు కనీస వసతి, సౌకర్యాలపై ఎక్కువగా దృష్టి సారించారు. ఈమేరకు టీటీడీ పాలక మండలి సభ్యులతో పాటు ఈవో, ఏఈవో, జేఈవోలతో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా భక్తుల వద్దకు వెళుతున్నారు. శ్రీవారి సేవకులు ఎలా వ్యవహరిస్తున్నారనే దానిపై ఆరా తీశారు. టీటీడీ అందజేస్తున్న ప్రసాదం, అన్న దానం గురించి కూడా వాకబు చేశారు. ఈ సందర్బంగా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట, నందకం మినీ కళ్యాణ కట్టల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్. భక్తుల తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షురకుల ప్రవర్తనపై అభిప్రాయాలను భక్తుల నుండి తెలుసుకున్నారు. ఒక ప్రాంతంలోని కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉండే కళ్యాణకట్టకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.