పరకామణి భవనం పరిశీలన
తిరుమల – తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించారు. నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సిసి టివి నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.
అనంతరం బూందీపోటుకు చేరుకున్న చైర్మన్ బూందీ తయారీ, నెయ్యి టిన్ లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోటు సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తి భావంతో ఉండాలని సూచించారు. పోటులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డూ బరువును లడ్డూ కేంద్రంలో తూకం వేసి పరాశీలించారు. ఈ సందర్భంగా లడ్డూ కేంద్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని ఆలయంలోని లడ్డూ పోటును పరిశీలించారు. అక్కడ లడ్డూ తయారు చేసే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు.