టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కామెంట్స్
తిరుపతి – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి ఆలయాన్ని గురువారం సందర్శించారు. గత కొన్ని రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈనెల 11న శుక్రవారం స్వామి వారి ఆలయంలో సీతా రామ కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆలయ ఏర్పాట్లను బీఆర్ నాయుడు పరిశీలించారు. సంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ సీతారాముల స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.
ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. వేలాదిగా తరలి వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు, మజ్జిగ, బిస్కెట్స్ , పులిహోర, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. జర్మన్ షెడ్ డిజైన్ తో కళ్యాణ వేదికను నిర్మించడం జరిగిందన్నారు.
సీతారామ కళ్యాణానికి లక్ష మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు.
130 సీసీ కెమెరాల సర్క్యూట్ , 7 డ్రోన్లతో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు బీఆర్ నాయుడు. రాజంపేట , కడప, తిరుపతి, ఇతర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఒంటిమిట్ట రాములోరి కళ్యాణోత్సవానికి ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. 2500 మంది టీటీడీ సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా పుష్పాలంకరణను తీర్చి దిద్దుతున్నామన్నారు.