DEVOTIONAL

ఆరోగ్యం అర్చ‌కుల‌కు అవ‌స‌రం

Share it with your family & friends

టీటీడీ శిక్ష‌ణ‌లో డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌

తిరుమ‌ల – అర్చకులు ఆరోగ్య నియమాలపై అవగాహన పెంచు కోవాలని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పి.మురళీకృష్ణ కోరారు. టీటీడీ ఆలయాల్లో ప‌నిచేస్తున్న‌ అర్చకులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉద్యోగుల శిక్ష‌ణ సంస్థ‌( శ్వేత) ఆధ్వర్యంలో తిరుపతి లోని ఎస్వీ వేద విశ్వ విద్యాలయంలో జరుగుతున్న పునశ్చరణ తరగతులు గురువారం నాటితో మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా డాక్టర్ పి.మురళీ కృష్ణ మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే అంశంపై మాట్లాడారు. వైద్య శాస్త్రంలో వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలన్నారు.

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేందుకు యోగా ఉపకరిస్తుందన్నారు. అర్చకులు చేసే అనుష్టాన ప్రక్రియ ప్రాణాయామంలో ఒక భాగమేనన్నారు. మనసు లగ్నం చేసుకోవడానికి యోగా, సూర్య నమస్కారాలు దోహదం చేస్తాయని వివరించారు. అనంతరం ఆరోగ్యకర ఆహార అలవాట్ల గురించి తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు వైఖానస ఆగమంలోని అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పి.సీతారామాచార్యులు, టీటీడీ ఆలయాల వైఖానస అర్చకులు పాల్గొన్నారు.